గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
జిల్లాలోని గర్భిణీ మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, గర్భిణీ మహిళల వైద్య సేవలపై, గ్రామంలో పారిశుధ్యం పై అధికారులతో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణి స్త్రీల ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తి చేయాలన్నారు. సబ్ సెంటర్ల వారీగా ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని అన్నారు. జిల్లాలో 100 శాతం ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్లకు, మెడికల్ అధికారులు, ఆశా కార్యకర్తలు రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని, గర్భం దాల్చిన మహిళలను గుర్తించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రికి రిఫర్ కావాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు ఆశా కార్యకర్తలతో ట్యాగ్ చేయాలని, ప్రసవం సమీపంలో ఉన్న గర్భిణీ మహిళలను ఆశా కార్యకర్తలు నిరంతరం మానిటరింగ్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చూడాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలలో అనీమియా కేసులను గుర్తించి వారికి అంగన్వాడి కేంద్రాల ద్వారా అవసరమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహించిన ఎన్.సి.డి. సర్వే లో వచ్చిన ఫలితాల ప్రకారం మందుల పంపిణీ పూర్తి స్థాయిలో జరగాలని, ఈ మందులను ప్రజలు వాడే విధంగా చూడాలని అన్నారు. సీ
జనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ కేసులు వచ్చిన ప్రాంతాలలో సర్వే నిర్వహించాలని అవసరమైన నేపథ్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల అధికారులతో సమయాన్ని తీసుకుంటూ మెరుగైన పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, జెడ్పి డిప్యూటీ సిఇఓ నాగలక్ష్మి, డివిజనల్ పంచాయతీ అధికారులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments