రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి
తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఏరియాలోని కాసీపేట 2 గనిలో కోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కంశెట్టి కిరణ్ కుమార్ (45) మృతి చెందాడు. బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు కిరణ్ కుమార్ బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లి, తిరిగి తన స్వగ్రామమైన రామకృష్ణాపూర్ పట్టణానికి తన ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతుండగా, బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని అదుపుతప్పి వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సోమవారం మృతుని కుటుంబ సభ్యులను గని సంక్షేమ అధికారి, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, గని పిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్, నాయకులు బోనగిరి రవి, శంకర్, బాపు లు పరామర్శించి, కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అంత్యక్రియల నిమిత్తం కిరణ్ తండ్రికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కిరణ్ అంతక్రియలు వారి సొంత గ్రామమైన జమ్మికుంటలో నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.


Comments