కుల వివక్షను నిర్మూలించడమే కేవీపీఎస్ లక్ష్యం
తెలంగాణ ముచ్చట్లు, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
స
మాజంలో పేరుకుపోయిన కుల వివక్షతను సమూలంగా నిర్మూలించడమే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) లక్ష్యమని సంఘం జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ తెలిపారు. సంఘం 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ కెవిపిఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాల సాధన కోసం, అంటురానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా, చారిత్రక అవసరంగా కేవిపీఎస్ ఏర్పడిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుల వివక్ష, అంటూరానితనంపై వందలాది గ్రామాల్లో, వేలాది మంది కార్యకర్తలచే సర్వేలు, అధ్యయనం నిర్వహించి, సుమారు 125 రకాల కుల వివక్ష రూపాలను వెలికి తీసిందని, వందల సంఘాలను ఐక్య చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు కోసం దశలవారీగా పోరాటం నిర్వహించి, జస్టిస్ పున్నయ్య కమిషన్ సాధించిన ఘనత చరిత్ర కేవీపిఎస్ కు కలదని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఏర్పాటుకు కెవిపిఎస్ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. జిల్లాలో సైతం దళితులపై జరిగిన దాడులకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి, బాధితుల పక్షాన కేవీపీఎస్ నిలిచిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా నేటికీ గ్రామాల్లో, పట్టణాల్లో కుల విపక్ష విలయతాండవమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన పాలన ప్రభుత్వాలు, పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఇంకా దళితులపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు దాసరి రాజేశ్వరి, కెవిపిఎస్ నాయకులు, కాలనీవాసులు రాజు, అఖిల్, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments