నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అభివృద్ధికి కేంద్రం దృష్టి సారించాలి
జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో ఈ ప్రాంతాన్ని చేర్చాలి
లోక్‌సభలో 377 నిబంధన ద్వారా ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం బ్యూరో, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి, జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి. సోమవారం లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రాచీన వారసత్వ కట్టడాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
*చారిత్రక ప్రాముఖ్యత ఉన్న స్తూపం*
నేలకొండపల్లి బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన బౌద్ధ వారసత్వ క్షేత్రంగా నిలిచింది. శాతవాహన, ఇక్ష్వాకు రాజవంశాల కాలంలో (క్రీ.శ. 3-4 శతాబ్దాలు) ఇది వికాసం సాధించినట్లు పురావస్తు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. తవ్వకాలలో మహాస్తూపాలు, విహారాలు, ఇటుక నిర్మాణాలు, బుద్ధ విగ్రహాలు, రోమన్-భారతీయ నాణేలు వెలుగులోకి రావడం దీని ప్రాధాన్యతను మరింత స్పష్టంచేస్తోంది.
*సదుపాయాల కల్పన అవసరం*
ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఈ స్థలం ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రహదారులు, సూచిక బోర్డులు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలు లేవని, సంరక్షణ లోపంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయని కూడా సూచించారు.
*జాతీయ బౌద్ధ పర్యాటక వలయంలో నేలకొండపల్లిని చేర్చాలి*
పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమగ్ర సంరక్షణ చేపట్టాలని, స్థలంలో మ్యూజియం మరియు ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే జాతీయ బౌద్ధ పర్యాటక వలయంలో నేలకొండపల్లిని చేర్చితే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ వారసత్వ కట్టడాన్ని పరిరక్షిస్తూ, తెలంగాణలో సాంస్కృతిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.


Comments