పేదల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం
రాంపల్లి గ్రామంలో ప్రజల స్పందన విశేషం
నాగారం, మార్చి 29 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం రాంపల్లి గ్రామంలోని ఎస్‌సి కాలనీ అంగన్‌వాడీ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది. కమలానగర్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు కీసర సీఐటీయూ మండల కమిటీలు సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.శిబిరాన్ని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వైద్య సేవలు అధిక ఖర్చుతో కూడుకున్నవిగా మారాయని, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు కాటరాక్ట్ శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తున్నామని పేర్కొన్నారు.శిబిరంలో కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్‌కు చెందిన అనిల్ కుమార్ బృందం కళ్ల పరీక్షలు నిర్వహించగా, దమ్మాయిగూడ మరియు సాకేత్–పద్మ సాయి డెంటల్ క్లినిక్స్‌కు చెందిన డాక్టర్ దినేష్ నమిలే బృందం దంత పరీక్షలు చేపట్టారు. అలాగే కమలానగర్ శ్రీకర హాస్పిటల్ వైద్యులు బీపీ, షుగర్, సాధారణ పరీక్షలతో పాటు ఆర్థో, న్యూరో, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. నాగారం కుమారి వెల్నెస్ కార్యక్రమం కూడా నిర్వహించారు.ఈ శిబిరంలో మొత్తం 143 మంది పాల్గొని వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ట్రస్ట్ తరఫున రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సిహెచ్ వరప్రసాద్, ట్రస్ట్ నాయకులు జీవీ రావు, పురుషోత్తం రెడ్డి, సంతోషి, సీఐటీయూ కీసర మండల నాయకులు చింతకింది అశోక్, కాంప్ కోఆర్డినేటర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments