జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగిన మోతుకులగూడెo
ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
జమ్మికుంట టౌన్ మార్చ్ 29 (తెలంగాణ ముచ్చట్లు):
మోతుకులగూడెం గ్రామం ఆదివారం సాయంత్రం భక్తిరసంతో కళకళలాడింది. స్థానిక భక్తాంజనేయ స్వామి దేవాలయంలోని హనుమాన్ ఉత్సవమూర్తిని అలంకరించి నిర్వహించిన శోభాయాత్ర గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.
సాయంత్రం 5 గంటలకు మోతుకులగూడెం చౌరస్తా నుంచి ఘనంగా ప్రారంభమైన ఈ శోభాయాత్ర భూలక్ష్మి మహాలక్ష్మి ఆలయం వరకు జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగుతూ సాగింది. డప్పుల మోత, భక్తి గీతాలు, హారతుల మధ్య సాగిన ఈ ఊరేగింపు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
హనుమాన్ మాలదారులు, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ముందుకు సాగారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయి, ఎక్కడ చూసినా భక్తి జ్వాలలు పరుచుకున్నాయి.
ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ శ్రీ పొనగంటి విష్ణు గారు ప్రసాద దాతగా ముందుకు వచ్చి భక్తులకు పులిహోర ఏర్పాటు చేయించడం విశేషం. శోభాయాత్ర అనంతరం భక్తులు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు.
భక్తుల ఐక్యత, ఉత్సాహం, భక్తి భావం కలిసిన ఈ శోభాయాత్ర మోతుకులగూడెం గ్రామంలో చిరస్మరణీయంగా నిలిచింది.


Comments