దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి
స్ఫూర్తి గ్రూప్ సంస్మరణ సభ
ఏ ఎస్ రావు నగర్, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, తెలంగాణ సాయుధ పోరాటంలో సాహిత్యపరంగా కీలక భూమిక పోషించిన దాశరధి కృష్ణమాచార్యుల 38వ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం కమలానగర్‌లోని కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ఆవిష్కరణలో పాల్గొన్న శారద, దాశరధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ అట్టడుగు వర్గాల అభ్యుదయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు దాశరధి కృష్ణమాచార్యులు” అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో రైతాంగ హక్కుల కోసం తన కలంతో, తన ఆలోచనలతో ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి దాశరధి అని అన్నారు.సీనియర్ నాయకుడు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, దాశరధి రచనలు సమాజ మార్పుకు ప్రేరణగా నిలిచాయని, “ఆ చల్లని సముద్ర గర్భం..” వంటి పాటలు శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో బలపరిచాయని పేర్కొన్నారు. సినీరంగంలో కూడా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించారని గుర్తుచేశారు. ఆయన తమ్ముడు దాశరధి రంగాచారి కూడా విశిష్ట రచయితగా నిలిచారని తెలిపారు.ఈ సందర్భంగా రుక్కయ్య “ఆ చల్లని సముద్ర గర్భం..” పాటను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం దాశరధి చిత్రపటానికి సభికులంతా పూలు సమర్పించి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, కేకే ఉన్నికృష్ణన్, గౌసియా, చంద్రమౌళి, జి. శివరామకృష్ణ, కోమటి రవి, శారద, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments