నాగారంలో యదేచ్చగా అక్రమ షెడ్ నిర్మాణాలు
పట్టించుకోని కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం
సత్యనారాయణ కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్డుపై వైన్స్ షాప్ కోసం అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం
నాగారం, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు బహిరంగంగా సాగుతున్నా, కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహం రేపుతోంది. సత్యనారాయణ కాలనీ ప్రజలు వైన్స్ షాప్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న సమయంలోనే, వైన్స్ కోసం మెయిన్ రోడ్డుపై అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం చేపట్టడం స్థానికులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది.అక్రమ నిర్మాణాలు ధైర్యంగా జరుగుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆరోపణ. మున్సిపల్ ఆదాయానికి ముఖ్యమైన పాత్ర పోషించే టౌన్ ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని వారు అంటున్నారు.
గతంలో కూడా అక్రమ నిర్మాణాలపై ఎన్నోసారి వార్తలు ప్రచురితమైనప్పటికీ, అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా కొనసాగితే నాగారం మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డాగా మారినట్టు భావించాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Comments