బిసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించాలి
-తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం విజ్ఞప్తి
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
బిసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించాలని కోరుతూ తెలంగాణ బిసి బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, బిసి కుల సంఘాలు హన్మకొండ జిల్లాలో బిసి కార్పొరేషన్ డీడీ రాంరెడ్డికి వినతి పత్రం సమర్పించాయి. ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయకుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బిసి, ఎంబీసీ, సంచార జాతుల వర్గాలు అనేక రంగాలలో వెనుకబడిపోయాయని, గత ప్రభుత్వాలు వీటి అభివృద్ధి కోసం సకాలంలో చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో లక్షలాది విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసి, ఉద్యోగాలు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, గత ప్రభుత్వాలు బిసి వర్గాల సమస్యలను గుర్తించి పరిష్కరించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, బిసి కుల సంఘాలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో, ప్రభుత్వం బిసి కులాల యువతీ, యువకుల జీవనోపాధి కోసం బిసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, సబ్సిడీ రుణాలు ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు బిసి బందు పేరుతో అందించడం జరిగిందని తెలిపారు.
కానీ, 2024-2025 బడ్జెట్‌లో బీసీలకు ఎనిమిది వేల కోట్ల మంజూరు అయినప్పటికీ, ఈ ఏడాది ఎప్పటికి రుణాల కోసం అర్హులైన బిసి కులాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా, ఆన్‌లైన్ ద్వారా రుణం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించి, అర్హులైన రుణ లబ్ధిదారులకు రుణాలు విడుదల చేయాలని బిసి బహుజన సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు మోహన్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నూతన కంటి ఆనందం, తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు సమ్మయ్య, గంగపుత్ర సంఘం నాయకుడు బర్కం రాంమోహన్ ఇతరులు పాల్గొన్నారు.


Comments