సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ.810 కోట్లు బోనస్.
సత్తుపల్లి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా భారీ బోనస్ ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో భాగంగా రూ.810 కోట్లు కార్మికులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం సోమవారం నాడు హైదరాబాదులో డా. బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, సింగరేణి యాజమాన్యం పాల్గొన్నారు.
సింగరేణి 2024-25లో మొత్తం రూ.6,394 కోట్లు ఆదాయం ఆర్జించింది. అందులో రూ.4,034 కోట్లు సంస్థ విస్తరణకు కేటాయించగా, రూ.2,360 కోట్లు కార్మికులకు పంపిణీ చేశారు. దసరా బోనస్‌గా 34 శాతం మేరకు రూ.810 కోట్లు కేటాయించారు. దీని ప్రకారం 41 వేల మంది శాశ్వత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,95,610 చొప్పున అందించనున్నారు. అలాగే దేశ చరిత్రలోనే తొలిసారి 30 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఒక్కొక్కరికి రూ.5,500 బోనస్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా యథావిధిగా మరో బోనస్ ఇవ్వనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది.
దేశానికి, రాష్ట్రానికి వెలుగులు నిచ్చే సంస్థగా సింగరేణి నిలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సంస్థను కాపాడుకోవడం కార్మికుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కార్మికులకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


Comments