దసరా రద్దీతో సత్తుపల్లి ఆర్టీసీకి బంపర్ ఆదాయం.
₹37 లక్షల 95 వేల 470 రూపాయలు.
సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత.
సత్తుపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
దసరా పర్వదినం సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. సోమవారం ఒక్కరోజే రూ.37,95,470 రూపాయల ఆదాయం నమోదు అయినట్లు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు. గతంలో రాఖీ పండుగ రోజున రూ.32 లక్షలు, గత ఏడాది దసరా సందర్భంగా రూ.34 లక్షలు ఆదాయం రాగా, ఈసారి వాటన్నింటినీ అధిగమించి కొత్త రికార్డు సృష్టించామని పేర్కొన్నారు.
పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 20 అదనపు బస్సు సర్వీసులు నడిపినట్లు తెలిపారు. ఆ రోజు 1.6 శాతం ఆక్రమణ రేటు, 67.80 ప్రయాణికుల కిలోమీటర్ల ఆదాయం సాధించామని వివరించారు. మొత్తం 55,977 కిలోమీటర్ల మేర బస్సులు రాకపోకలు సాగించాయని చెప్పారు.
ఈ విజయానికి డిపో సిబ్బంది కృషే కారణమని, అందరి సమష్టి సహకారంతోనే ఈ రికార్డు సాధ్యమైందని సునీత అభినందించారు. అనంతరం డిపో గేటు వద్ద సిబ్బందితో కలిసి కేక్ కోసి ఆనందోత్సవాలు నిర్వహించారు.
కార్యక్రమంలో సహాయ మేనేజర్ పీ.విజయశ్రీ, ఆర్థిక విభాగ అధికారి ఎస్.సాహితీ, విభాగాధిపతులు, పర్యవేక్షకులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.


Comments