ఉచిత కోచింగ్ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి కలెక్టర్ సన్మానం
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రంలో ఉచిత కోచింగ్ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నట్లు ప్రశంసించారు. పేద మరియు మధ్యతరగతి యువతకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీనిని ఉపయోగించుకుని అభ్యర్థులు తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఉన్నత విద్యాభ్యాసంతో ఉద్యోగ లక్ష్యం షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం ద్వారా ప్రోత్సాహం పొందిన విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతిభ కనబరచాలని, అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
కార్యక్రమంలో హనుమకొండ డిప్యూటీ డైరెక్టర్ ఎ. శ్రీలత, షెడ్యూల్ కులాల అధ్యయన కేంద్రం గౌరవ సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి కె. కృష్ణ పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు రాజేందర్, రమేష్, సునీల్, సంధ్య, రాకేష్, రాజశేఖర్, మౌనిక, కిరణ్, సాంబమూర్తి తదితరులను అభినందించారు.


Comments