జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు పూర్తి స్ధాయి చర్యలు...
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
*సురక్షిత డ్రైవింగ్ తో రహదారి ప్రమాదాలను నివారించవచ్చు*
*ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి*
*కలేక్టరేట్ లో రోడ్డు భద్రత కమిటీ చర్యల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం బ్యూరో, జనవరి 20(తెలంగాణ ముచ్చట్లు)
జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 30 జంక్షన్ ల వద్ద ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు జంక్షన్ లు, ప్రధాన రహదారులపై జరిగే ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కమిటీ చేపట్టిన చర్యల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* ఖమ్మం జిల్లాలో 30 జంక్షన్ లలో 50 శాతం పైగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామని, జంక్షన్ల వద్ద రోడ్డు భద్రతా ప్రమాణాలు చేపడితే ప్రమాదాలు నియంత్రించవచ్చని అన్నారు.
30 జంక్షన్ల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు రంబుల్ స్ట్రీప్స్, లేన్ మార్కింగ్, రాత్రి వేళల్లో సరిగ్గా కనిపించేందుకు ఏర్పాట్లు, ఆక్రమణల తొలగింపు, జీబ్రా క్రాసింగ్, సైన్ బోర్డ్స్, బ్లింకర్స్ ఏర్పాటు వంటి చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో 30 జంక్షన్ల వద్ద రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడం ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోతే ఒక కుటుంబం తీవ్రంగా ప్రభావితం అవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి జంక్షన్ ల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, నేషనల్ హైవే ఇఇ యుగంధర్, పిడి దివ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments