పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు శాశ్వత అంగన్వాడీ భవనాల నిర్మాణం
ములుగు,తెలంగాణ ముచ్చట్లు:
వెంకటాపూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవనానికి బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శంఖుస్థాపన చేశారు.
అంగన్వాడీ భవనాల ప్రాధాన్యత
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టామని, నారాయణపూర్ గ్రామంలో నిర్మాణం ప్రారంభించడం గర్వకారణమన్నారు.
“పిల్లల మానసిక వికాసం పూర్వ ప్రాథమిక విద్యతోనే మొదలవుతుంది. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్య అందించడమే అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం” అని ఆమె పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో భవిష్యత్ తెలంగాణను నైపుణ్య వనరుల రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు.
సమయానికి పనుల పూర్తి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు మాట్లాడుతూ, నిర్మాణ పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు (సీవియర్ ఆక్యుట్ మల్న్యూట్రిషన్), (మోడరేట్ ఆక్యుట్ మల్న్యూట్రిషన్) సమస్యలు లేకుండా అన్ని పిల్లల ఆరోగ్యం సాధారణ స్థాయికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా సంక్షేమ అధికారి కె. శిరీష మాట్లాడుతూ, కొత్త అంగన్వాడీ భవనాలకు మంజూరులు పొందినందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మంత్రి సీతక్క చేతుల మీదుగా గ్రామంలో గర్భిణీ స్త్రీల సీమంతాలు, పిల్లలకు అన్నప్రాశన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు.
.jpeg)
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, సీడీపీవోలు ఈపి ప్రేమలత, ధనలక్ష్మి, స్థానిక ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Comments