మహిళా కార్మికుల దోపిడీ ఆపాలి వెంటనే జీతాలు పెంచాలి సీఐటీయూ
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నాచారం, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
నాచారం ఐడీఏలోని షాహీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ వద్ద మహిళా ఉద్యోగినులు జీతాల పెంపు కోసం చేపట్టిన ఆందోళన బుధవారం మూడో రోజున కూడా కొనసాగింది. తక్కువ వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్నామని, పెరిగిన జీవన వ్యయాలతో జీవనం కష్టమైందని మహిళలు వేదన వ్యక్తం చేశారు.యాజమాన్యం స్పందించకపోవడంతో సమ్మె ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి.ఉద్యోగినులు కనీసం రూ.5000 వేతన పెంపుతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అమలు, పని ఒత్తిడి తగ్గించడం,తాగునీరు–టాయిలెట్ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
*మహిళా కార్మికుల దోపిడీ కొనసాగుతోంది*
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ… షాహీ యాజమాన్యం తక్కువ వేతనాలతో మహిళలను దోపిడీ చేస్తోందని అన్నారు. వెంటనే వేతనాలు పెంచి, పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
*మూడో రోజుకీ రోడ్డుపైనే*
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ… మూడో రోజుకీ మహిళలు రోడ్డుపైనే నిలబడటం వారి దుస్థితిని తెలియజేస్తోందని అన్నారు. చట్టాల ప్రకారం ప్రయోజనాలు కల్పించాలని సూచించారు.
*దోపిడీ ఆపాలి*
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ… జీతాలు పెంచకుండా పని ఒత్తిడి పెంచడం అప్రజాస్వామిక చర్య అని, యాజమాన్యం దోపిడీ ఆపాలని కోరారు. స్పందన లేకపోతే పోరాటం విస్తరిస్తుందన్నారు.
*చట్టబద్ధ హక్కులే*
రాష్ట్ర కార్యదర్శి జే. చంద్రశేఖర్ మాట్లాడుతూ… పీఎఫ్, ఈఎస్ఐ, భద్రతా సదుపాయాలు ఉద్యోగులకు లభించాల్సిన చట్టబద్ధ హక్కులేనని, యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి ఆపాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
*స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం*
మేడ్చల్ మాజీ అధ్యక్షులు కోమటి రవి మాట్లాడుతూ… మూడురోజులుగా ఆందోళన జరుగుతున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని, వెంటనే చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కోశాధికారి పి. గణేష్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి జే. చంద్రశేఖర్, ఎస్. రమ, కోమటి రవి, నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments