ఖమ్మం జిల్లా టి.డబ్ల్యూ.జే.ఎఫ్ అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు
ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా టి.ఎస్. చక్రవర్తి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి.డబ్ల్యూ.జే.ఎఫ్) ఖమ్మం జిల్లా అడ్‌హాక్ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కోణార్క్ హోటల్‌లో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. సాదిక్ పాషా తదితరుల సమక్షంలో కమిటీ ఎన్నిక కాగా, మంగళ వారం ఈ కమిటీని ప్రకటించారు.
ఖమ్మం జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష్ చక్రవర్తి, కో–కన్వీనర్లుగా అర్వపల్లి నగేష్, అంతోటి శ్రీనివాస్, నానబాల రామకృష్ణ, వందనపు సామ్రాట్ లను నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో–కన్వీనర్లు వల్లాల జగన్, జి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. గోపాల్, పాల్వాయి జానయ్య, సీనియర్ జర్నలిస్ట్ సాదిక్ పాషా సహకారంతో జిల్లా స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని వెల్లడించారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఏర్పడిందని మామిడి సోమయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్మిక శాఖ గుర్తింపు పొందిన తొలి జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్ కూడా టి.డబ్ల్యూ. జే. ఎఫ్ నేనని అని ఆయన గుర్తు చేశారు.
ఫెడరేషన్ ఏ రాజకీయ పార్టీకి గానీ, ఏ ఒక్క పత్రికకు గానీ అనుబంధ సంఘం కాదని, పూర్తిస్థాయి స్వతంత్రంగా జర్నలిస్టుల పక్షాన పనిచేసే స్వతంత్ర సంఘమని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది కావాలని ఈ సంఘాన్ని పార్టీ సంఘం లేదా పత్రిక సంఘంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను జర్నలిస్టులు ఎవ్వరూ నమ్మవద్దని ఆయన కోరారు.జర్నలిస్టుల సమస్యలపై ధైర్యంగా పోరాడే వేదికగా టి.డబ్ల్యూ.జే.ఎఫ్ నిలుస్తుందని తెలిపారు.
ఖమ్మం జిల్లా ఫెడరేషన్‌లో ఇప్పటికే ఉన్న పాత సభ్యులతో పాటు, కొత్తగా చేరేందుకు ముందుకు వచ్చే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కూడా సభ్యులుగాచేర్చుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. 


Comments