పోచారంలో సామాన్యుడి ప్లాట్ కి స్వాతంత్ర్యం
హైడ్రా అడ్డుగోడ కూల్చడంతో,ప్లాట్ యజమానుల సంబరాలు
మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతాప్‌సింగారం గ్రామ భవానీనగర్ లేఔట్ ప్లాట్ యజమానులు ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత విజయం సాధించారు. తమ భూముల చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీని హైడ్రా అధికారులు శుక్రవారం తొలగించడంతో ప్లాట్ యజమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. తమ స్థలాలను నేరుగా చూడగలిగే స్వేచ్ఛ లభించడంతో సంబరాలు చేసుకున్నారు.1978లో సర్వే నంబర్లు 315, 316, 317ల్లో 27 ఎకరాల్లో భవానీ నగర్ లేఔట్ రూపొందించబడింది. సుమారు 400 ప్లాట్లు కలిగిన ఈ లేఔట్ అప్పట్లో గ్రామపంచాయతీ ఆమోదం పొందింది. తరువాత ఇది పోచారం మున్సిపాలిటీ పరిధిలోకి చేరింది. లేఔట్‌లో భాగస్వాములలో ఒకరైన మలిపెద్ది జనార్ధన్‌రెడ్డి కుమారుడు మలిపెద్ది మధుసూధన్‌రెడ్డి 6.14 ఎకరాల భూమిపై పాసుబుక్ సృష్టించి రైతుబంధు నిధులు కూడా పొందాడు. అనంతరం ఆ భూభాగం చుట్టూ ప్రహరీ నిర్మించి, ప్లాట్ యజమానులను లోపలికి అనుమతించలేదు.దీంతో 88 ప్లాట్ల యజమానులు రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రైతుబంధు సాయం రద్దయినా సమస్య పరిష్కారం కాలేదు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం పోరాటం కొనసాగించారు.
హైడ్రా జోక్యం – అడ్డుగోడ కూల్చివేత
భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలపై అధికారులు స్థలాన్ని పరిశీలించారు. లేఔట్ మొత్తం 27 ఎకరాల్లోనే ఉందని, ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి మున్సిపల్ లేదా గ్రామపంచాయతీ అనుమతి లేదని నిర్ధారించారు. రహదారులను బ్లాక్ చేసినట్లు తేలడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టి ప్రహరీని కూల్చివేశారు.తర్వాత హైడ్రా అధికారులు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ప్లాట్ యజమానులు, మలిపెద్ది మధుసూధన్‌రెడ్డిని సమక్షంలో చర్చలు జరిపి ప్లాట్ యజమానులకు న్యాయం చేశారు.
“మాకు స్వాతంత్ర్యం లభించింది”
“ఎనిమిదేళ్లుగా తలపెట్టిన పోరాటం ఫలించింది. మా ప్లాట్లు మళ్లీ మా కళ్లముందు కనిపిస్తున్నాయి,” అంటూ యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ లేఔట్ ప్రకారం స్థలాల గుర్తింపు పనులు ప్రారంభమయ్యాయి. ప్లాట్ యజమానులు స్వేచ్ఛను సంపాదించుకున్నందుకు “స్వాతంత్ర్య సంబరాల్లా” వాతావరణం నెలకొంది.


Comments