భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్‌ను నిలబెట్టాలి
సీఎం రేవంత్ రెడ్డి
-జాతీయ చలనచిత్ర అవార్డులు పొందిన సినీ ప్రముఖులను సీఎం సన్మానం
-సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుంటామన్న భరోసా
-సినిమా అభివృద్ధికి అవసరమైన చేయూత అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం
-భగవంత్ కేసరి,హనుమాన్,బేబి చిత్ర బృందాలకు సీఎం అభినందనలు
హైదరాబాద్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్ నగరాన్ని భారతీయ సినిమా నిర్మాణానికి ప్రధాన కేంద్రంగా నిలబెట్టే కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగానికి అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటూ, అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ప్రముఖులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన సీఎం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు తెలియజేస్తూ వారిని సన్మానించారు. భగవంత్ కేసరి చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి, హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి చెందిన వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా దర్శకుడు సాయి రాజేశ్, గాయకుడు రోహిత్‌లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు


Comments