వైన్ షాప్ ఏర్పాటు ఆపాలని పెద్ద ఎత్తున కాలనీ వాసులు ధర్నా
కుషాయిగూడ, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయి నగర్ కాలనీలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు, మహిళలు, కాలనీవాసులు భారీగా ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం సాయి నగర్ కమాన్ సమీపంలోని యారో డ్రైవ్‌ఇన్ వద్ద కొత్త వైన్ షాప్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే కాలనీవాసులు అక్కడకు చేరుకొని ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా చర్లపల్లి కాలనీల సమైక్య అధ్యక్షుడు వేంపల్లి పద్మా రెడ్డి, సాయి నగర్ కాలనీ అధ్యక్షుడు సారా వినోద్ కుమార్, జ్యోతి ఆక్రోపోలిస్ అపార్ట్మెంట్ నివాసులు మాట్లాడుతూ — “మా ప్రాంతం పూర్తిగా నివాస ప్రాంతం. ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేస్తే మహిళలు, పిల్లలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారు. మత్తు మద్యం దుకాణాలు సమాజంలో చెడు ప్రభావం చూపుతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైన్ షాప్ పనులను వెంటనే ఆపాలని, లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ కార్యాలయం, కుషాయిగూడ పోలీస్ స్టేషన్, అబ్కారి అధికారులకు విన్నపాలు సమర్పించారు. కొంతసేపు రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించడంతో నాగారం–కుషాయిగూడ ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరించబడింది. అయినా కూడా ఆందోళనకారులు వైన్ షాప్ నిర్మాణ ప్రాంగణం ఎదుట మళ్ళీ చేరి నిరసన కొనసాగించారు.ప్రజల అభ్యంతరాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, నివాస ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటు నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Comments