సీపీఐ శతజయంతి వర్క్‌షాప్ గోడపత్రిక విడుదల
డిసెంబర్ 12-14 వరకు రాష్ట్ర స్థాయి ఏఐవైఎఫ్ వర్క్‌షాప్
హిమాయత్‌నగర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతజయంతి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుండి 14 వరకు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు సంబంధించిన గోడపత్రికను హిమాయత్‌నగర్‌లోని మక్ధూమ్ భవన్‌లోని రాజ్ బహదూర్ హాల్‌లో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ
భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించబడి, అప్పటినుంచి సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు పోరాటం సాగిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంఘాల ఏర్పాటు ద్వారా కార్మికులు, కర్షకులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, దళిత బహుజనుల చైతన్యానికి సీపీఐ ముఖ్య పాత్ర పోషించిందని తెలిపారు. దేశంలో యువజన వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక వనరులు మెరుగుపడేలా ఉద్యమాలను నిర్మించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. సీపీఐ 100 ఏళ్ల చరిత్రను ప్రజలకు పరిచయం చేసి, ప్రజా బాహుల్యంలో ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఏఐవైఎఫ్ కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు బిజ్జ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, లింగం రవి, శ్రీమాన్, చేపూరి కొండల్, కార్యవర్గ సభ్యుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments