రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం
వేలేరు,అక్టోబర్27(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేలేరు మండలంలోని పీచర గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.రైతులు దళారుల వద్ద నష్టపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు ధాన్యం కొనుగోలు చేయకపోతే, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఈ సీజన్‌లో మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
సన్న రకం ధాన్యానికి 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయల మద్దతు ధరను నిర్ణయించారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తేమ శాతం 17 లోపు ఉండాలని, ప్రతి బస్తా 41 కిలోలకు మించరాదని సూచించారు. మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్మాలని, దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దని సూచించారు. కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్ లైట్లు, క్లీనింగ్ మిషన్, మయిశ్చర్ మిషన్, టార్పాలిన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు రుణమాఫీ, 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు పెట్టుబడి సాయం అందించడం చారిత్రాత్మకమని అన్నారు. సన్నలకు రూ.500 బోనస్, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజా సంక్షేమానికి నిదర్శనమని చెప్పారు.గత పాలకులు ప్రజా ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలను మాత్రమే చూసుకున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధినే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. రెండు సంవత్సరాల్లో రూ.1,388 కోట్ల నిధులను తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
వేలేరు మండలం పీచర గ్రామంలో రూ.83 లక్షల సిసి రోడ్లు, 65 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండవ విడతలో మరో 50 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా పీచర–వేలేరు వైయా శాలపల్లి రోడ్డుకు రూ.6 కోట్లు, పీచర–కొమ్ముగుట్ట రోడ్డుకు రూ.3 కోట్లు, పీచర–వావిల్లకుంట తండా రోడ్డుకు రూ.1.42 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ, సివిల్ సప్లై డీఎం, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments