వందేమాతరం గీతం – దేశభక్తికి ప్రతీక
మానవ హారంలో వందేమాతర గీతం ఆలపించిన ప్రజలు
-మన స్వాతంత్ర్య సమరయోధులలో
ఆత్మవిశ్వాసాన్ని రగిలించిన గీతం
-ఎస్సై ఏ. ప్రవీణ్ కుమార్
ఎల్కతుర్తి. నవంబర్ 07(తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య సమరయోధులలో ఆత్మవిశ్వాసం, త్యాగస్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతం 150 ఏళ్ల వేడుకల సందర్భంగా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మానవ హారంలా ఏర్పడి ప్రజలు గీతాన్ని ఘనంగా ఆలపించారు.
ఈ కార్యక్రమానికి ఎస్సై ఏ. ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన స్వాతంత్ర్య సమరయోధుల హృదయాల్లో జ్వాల రేపిన వందేమాతరం గీతం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఈ గీతం దేశభక్తిని, ఐక్యతను స్ఫూర్తిగా నింపుతుంది” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకొని, మానవ హారంలా నిలబడి వందేమాతరం గీతాన్ని ఉత్సాహంగా ఆలపించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి మొత్తం దేశభక్తి నినాదాలతో మార్మోగింది.
కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని దేశమాతకు వందనం చేశారు. వందేమాతరం గీతం
150 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం పట్ల పాల్గొన్నవారు ఆనందం వ్యక్తం చేశారు.


Comments