తన స్వగ్రామంలో అంగన్‌వాడీ, పాలన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
స్వగ్రామంలో చిన్నారుల భవిష్యత్తుకు శంకుస్థాపన చేసిన మంత్రి
-తల్లుల ఉపాధికి భరోసా కల్పించే పాలన కేంద్రాలు
-చిన్నారుల కోసం ఆట వస్తువులు, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు
-మూడేళ్ల లోపు పిల్లల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ములుగు,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
ములుగు మండలంలోని తన స్వగ్రామం జగ్గన్నపేటలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అంగన్‌వాడీ, పాలన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. అదే గ్రామంలో కొత్త అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన పాలన కేంద్రంలో చిన్నారుల కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, ఆట వస్తువులు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా మూడేళ్లలోపు పిల్లల సంరక్షణ కోసం ఈ కేంద్రాలు పనిచేస్తాయి. పట్టణాల్లోని ప్లే స్కూల్ల తరహాలో పల్లెల్లోని చిన్నారులకు మంచి సంరక్షణ అందించడం, వారి తల్లులకు ఆసరాగా నిలవడం పాలన కేంద్రాల ప్రధాన లక్ష్యం అని మంత్రి వివరించారు.
తల్లులు తమ చిన్నారులను సురక్షితంగా పాలన కేంద్రంలోని సిబ్బందికి అప్పగించి ఆందోళన లేకుండా పనుల కోసం వెళ్లవచ్చు. చిన్నారులను పనిస్థలాలకు తీసుకెళ్లలేక చాలామంది తల్లులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని, ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాలన కేంద్రాలను ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
చిన్నారుల సంరక్షణతో పాటు తల్లుల ఉపాధికి భరోసా కల్పించే విధంగా పాలన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని సీతక్క స్పష్టం చేశారు.


Comments