ప్రతి నెల మొదటి ఆదివారం అంబేద్కర్‌కు దండ కార్యక్రమానికి శ్రీకారం
-అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
హైదరాబాద్,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు పిడమర్తి రవి తెలిపారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని,
జనవరి మొదటి ఆదివారం నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు దండ వేయడం ద్వారా ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు ఎక్కడ ఉన్నా, వారి వారి ప్రాంతాల్లో స్వచ్ఛందంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో సమానత్వం, న్యాయం, సామాజిక సమతా భావాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పిడమర్తి రవి పేర్కొన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రజల నిత్య జీవితంలో అమలయ్యేలా చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు అంబేద్కర్ ఆలోచనలపై అవగాహన పెంచుకుని, సామాజిక మార్పుకు భాగస్వాములవ్వాలని ఆయన కోరారు. అంబేద్కర్ చూపిన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నాటాలని ఆయన అభిప్రాయపడ్డారు.జనవరి మొదటి వారంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించనున్నట్లు పిడమర్తి రవి తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments