పెరియార్ రామస్వామి నాయకర్ 52వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం
ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం – స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో బుధవారం కమలానగర్ కార్యాలయంలో సామాజిక సంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ 52వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.ముందుగా స్ఫూర్తి గ్రూప్ యువ నాయకులు గిరీష్ కుమార్, సీనియర్ నాయకులు కృష్ణమాచార్యులు పెరియార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు కోమటి రవి మాట్లాడుతూ, సామాజిక చైతన్యం కల్పించడంలో పెరియార్ చేసిన కృషి అమూల్యమని తెలిపారు. మనువాద దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం పోరాడారని, నేటికీ తమిళనాడులో ద్రవిడ ఉద్యమం బలంగా కొనసాగడానికి పెరియార్ ఆలోచనలే పునాదిగా నిలిచాయని అన్నారు. మూఢాచారాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నాస్తిక భావజాలంతో ఆయన సాగించిన ఉద్యమాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పెరియార్‌కు గురుతుల్యులైన జ్యోతిరావు పూలే రచించిన ‘గులాంగిరి’ పుస్తకంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు. ముందుగా ఎం. భాస్కర్ రావు పుస్తకాన్ని పరిచయం చేశారు. సామాజిక ఉద్యమ నాయకులు జయరాజు మాట్లాడుతూ, ‘గులాంగిరి’ గ్రంథం నేటి సమాజానికీ సమానంగా వర్తిస్తుందని అన్నారు. బ్రాహ్మణీయ భావజాలం, ముఖ్యంగా మనువాదం ప్రజలను విషచక్రంలో నెట్టిందని విమర్శించారు. జ్యోతిరావు పూలే అనేక వివక్షలను ఎదుర్కొని విద్య ద్వారానే విముక్తి సాధ్యమని నమ్మి, అందరికీ చదువు అందించే మహత్తర ఉద్యమాన్ని చేపట్టారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శివన్నారాయణ, రహీం, కృష్ణమాచార్యులు, గిరీష్, మల్లేష్, రుక్కయ్య, గుమ్మడి హరిప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అణగారిన వర్గాలు స్వయం గులాంగిరిని అనుభవించిన దుస్థితిని ఈ గ్రంథం ప్రతిబింబిస్తుందని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పూలే ఇచ్చిన పిలుపును ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
అంతకుముందు పెరియార్ చిత్రపటానికి అందరూ పూలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, గౌస్య, జయరాజు, వెంకటయ్య, ఎన్. శ్రీనివాస్, మల్లేష్, భాస్కర్ రావు, శివన్నారాయణ, హరిప్రసాద్, కోమటి రవి, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments