గ్రీన్‌ఫీల్డ్ హైవే సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయండి.
బిజేపి రాష్ట్ర అధ్యక్షులకు నెల్లూరి వినతి.
ఖమ్మం బ్యూరో, అక్టంబర్ 03, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం నుండి దేవరపల్లి వెళుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే విషయంలో రైతులు పడుతున్న సమస్యలను బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపనేని రామచంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ హైవే వలన రైతులు పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వివరించారు.
సత్తుపల్లి ఎగ్జిట్ వరకు సాగుతున్న ఈ హైవే నిర్మాణం భూములను రెండు ముక్కలుగా విభజించిందని, పొలాలకు వెళ్లే దారులు లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ధాన్యం రవాణా వాహనాలకు దారి లేకపోవడంతో సాగు పనులు స్తంభించిపోతున్నాయని, చెరువులు–వాగులు–కాలువల క్రింద ఉన్న భూములకు చేరుకోవడమే కష్టసాధ్యమైందని నెల్లూరి వివరించారు.
నాగార్జునసాగర్ కమాండ్ ఏరియాలో ఉన్న ఈ భూములు నీటిపారుదల ఆధారంగానే పంటలు పండిస్తాయని, కానీ సర్వీసు రోడ్లు లేకపోవడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించడం కష్టమైందని చెప్పారు. హైవే కోసం రైతులు వ్యతిరేకం కాదని, కానీ వారి జీవనాధారాన్ని కాపాడే విధంగా వెంటనే ఇరువైపులా సర్వీసు రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్వీస్ రోడ్ నిర్మాణ విషయంలో జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా వినతి పత్రాన్ని కేంద్ర రహదారులు, రవాణా & హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి లకు వినతి పత్రం పంపినారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బిజెపి నాయకులు బండారు నరేష్, యార్లగడ్డ రాఘవ రావు తదితరులు ఉన్నారు.


Comments