రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు..... 

రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు..... 

WhatsApp Image 2025-01-04 at 9.59.05 PM

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మంత్రి, హైదరాబాద్ నుంచి రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. 
రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు. పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాల పై అవగాహన కల్పించేందుకు  ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత ప్రతి జిల్లా, మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు. 
ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు.  రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్డు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. 
మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని, పాఠశాలల్లో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  పిల్లలకు అందించే ఆహార నాణ్యతను కలెక్టర్లు, ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని,  కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని , నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.  
రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు.  ప్రస్తుత సమాజంలో  జరిగే రోడ్డు ప్రమాదాలలో 75 శాతం డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు.  రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి ఒక ప్రణాళిక ఉండాలని, దీనిపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న రోడ్డు సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించాలని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్ఎం రేడియో, కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఉండేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. సమీక్ష లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో నెల రోజుల క్రితం రోడ్డు భద్రత ప్రమాణాలపై సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రారంభించామని అన్నారు. జిల్లాలో ఉన్న స్కూల్ క్రాసింగ్ మొత్తం మ్యాప్ చేసుకున్నామని,  పిల్లలు రోడ్డు క్రాస్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీచర్లకు, పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేశామని  అన్నారు.
జిల్లాలోని ఆటో డ్రైవర్ లకు హెల్త్ క్యాంప్ నిర్వహించామని, రోడ్డు భద్రతా ప్రమాణాల పై అవగాహన కల్పించామని అన్నారు. షాపింగ్ మాల్స్ లో రోడ్డు భద్రతా ప్రమాణాల పై ప్రచారం చేస్తున్నామని అన్నారు. నూతన నిర్మాణాలకు పార్కింగ్ లేనిది అనుమతి ఇవ్వడం లేదని, షాపింగ్ మాల్స్ లో సెల్లార్లు మాత్రమే పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. జాతీయ రహదారులలో స్పీడ్ లిమిట్ బోర్డులు చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2025 కు సంబంధించిన గోడప్రతిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ వీడియో సమావేశంలో అదనపు డిసిపి నరేష్ కుమార్, జిల్లా రవాణాధికారి వెంకటరమణ, ఆర్ అండ్ బి ఎస్.ఈ. ఎం.బి. హేమలత, ఎన్.హెచ్. ఈఈ యుగంధర్, ఆర్డీఓ జి. నరసింహారావు, ఆర్ అండ్ బి ఈ.ఈ.  తానేశ్వర్, నేషనల్ హై వే అధికారిణి కె. దివ్య, మధిర మునిసిపల్ కమిషనర్ ఏ. సంపత్ కుమార్, సత్తుపల్లి, మధిర టి.పి.ఎస్. శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .