ప్రశ్నించే గొంతుక మూగబోయింది.
ప్రసాద్ సంస్మరణ సభలో అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ప్రజల పక్షాన రాజ్యాంగ బద్దమైన హక్కుల కోసం ప్రశ్నిస్తూ పోరాడే పోటు ప్రసాద్ మరణంతో ప్రశ్నించే గొంతుక మూగబోయిందని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో జరిగిన పోటు ప్రసాద్ సంస్మరణ సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ మరణం ఓ షాక్ అని ఊహించని ఈ పరిణామం నుంచి కోలుకోవడం పార్టీ శ్రేణులకే కాదు ఆయన సన్నిహితులకు ఇబ్బందికరమేనన్నారు. ప్రసాద్ అనారోగ్యానికి గురై మరణానికి దగ్గరగా ఉన్న దాఖలాలు లేవని అయినా ఆకస్మిక మరణం పొందడం బాధాకరమన్నారు. హక్కుల కోసం ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ప్రసాద్ లాంటి వారిని కోల్పోవడం యావత్ సమాజానికి తీరని లోటన్నారు. హక్కుల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నినదిస్తూ, వివరిస్తూ రాజ్యాంగ హక్కుల అమలుకు పోరాటాలు సాగించే వ్యక్తులను కోల్పోవడం ఈ వ్యవస్థకు చాలా నష్టమన్నారు. పోటు ప్రసాద్ మితభాషి అని ఇలా ఉండేవారిలో సామాజిక పరమైన సంఘర్షణ ఉంటుందన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి పోరాటాలు సాగిస్తున్న వ్యక్తులు మరణించడం అట్టడుగు వర్గాల ప్రజలకు తీరని నష్టమన్నారు.
తుదిశ్వాస వరకు పోరాడిన ప్రసాద్ : పువ్వాడ
పోటు ప్రసాద్ తుద్విశ్వాస వరకు ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడారని సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. ప్రసాద్ సంస్మరణ సభలో మాట్లాడుతూ విద్యాభ్యాసం కోసం ఖమ్మం వచ్చిన ప్రసాద్ విద్యార్థి ఉద్యమ నేతగా ఎదిగారని కమ్యూనిస్టు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పలు సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటంలో ముందు భాగంలో నిలిచారన్నారు. పోటు ప్రసాద్ కుటుంబం యావత్ పార్టీకి అంకితమై పనిచేసిందని సమాజ మార్పు కోసం ఆ కుటుంబం చేసిన త్యాగం వెలకట్ట లేనిదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కడ వరకు ప్రయత్నించడమే అత్యుత్తమ కమ్యూనిస్టు లక్షణమని ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ ఉండాలని పువ్వాడ సూచించారు.
జిల్లా శాఖను ఆదర్శంగా నిలిపారు :పల్లా వెంకట రెడ్డి
కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వేళ ఖమ్మం జిల్లా సమితిని రాష్ట్రంలోనే మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిపిన ప్రసాద్ మహోన్నతుడని నవచేతన విజ్ఞాన సమితి అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు పల్లా వెంకటరెడ్డి తెలిపారు. పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన్మించిన పోటు ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారన్నారు. పోటు ప్రసాద్ కుటుంబానికి ఎనలేని చరిత్ర ఉందని ఆ కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రసాద్ సిద్దాంతాన్ని ఆచరణలో చూపిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆదర్శవంతమైన విప్లవకారున్ని పార్టీ కోల్పోయిందన్నారు.
.jpeg)

ఆదర్శవంతమైన కమ్యూనిస్టు ప్రసాద్: ముప్పాళ్లఆదర్శవంతమైన కమ్యూనిస్టులలో పోటు ప్రసాద్ ఒకరని ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే. ఆయనకు ఇచ్చే నివాళి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. ప్రసాద్లో లౌక్యం ఉందని అదే సమయంలో బాధ్యతల విషయంలో రాజీపడే వాడు కాదన్నారు. ఈ సభలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్, ఎ. వనజ, బాగం హేమంతరావు, పశ్య పద్మ, ఎస్ కె సాబీర్్పషా, మహ్మద్ మౌలానా, గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుమ్మల యుగంధర్, పోతినేని సుదర్శన్, పోట్ల మాధవరావు తదితరులు ప్రసంగించారు. ఈ సభకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.


Comments