మూడు రోజుల సెలవు… రైతులకు నష్టం!
గెలలు రాలిపోతున్నాయంటూ అశ్వరావుపేట, దమ్మపేట రైతుల ఆవేదన.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
పామాయిల్ రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. అశ్వరావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యం సెప్టెంబర్ 19, 20, 21 తేదీల్లో వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించడం రైతుల గుండెల్లో ధడధడలేస్తోంది. ఫ్యాక్టరీలు 22నుంచి గెలల కొనుగోలు చేస్తామని ప్రకటించినా, అప్పటికే కోసిన గెలలు పండిపడి నేలరాలిపోతున్నాయంటూ రైతులు వాపోతున్నారు.
గెలలు కోసిన తర్వాత ఆలస్యం అయితే బరువు తగ్గిపోతుంది. దీంతో వెయిట్ లాస్ వలన ఆర్థికంగా భారీ నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. “ఎరువులు, పనివారి కూలీలు భరించలేని స్థాయిలో పెరిగిపోయాయి. అలాంటిదే వరుస సెలవులు ఇవ్వడం పంట వృథా అవ్వడానికి దారితీస్తోంది” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇలాంటి నిర్ణయాలపై ముందుగానే రైతులకు సమాచారం ఇవ్వాలి. గెలలు పండిన వెంటనే కొనుగోలు జరగాలి. వరుస సెలవుల వలన రైతులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు.


Comments