రైల్వే సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తిన వరంగల్ ఎంపీ కడియం కావ్య
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
లోక్‌సభలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య రైల్వే సంబంధిత పలు అంశాలను ప్రస్తావించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ ఏర్పాటు, బైపాస్ లైన్ల సమస్యలు, ప్లాట్‌ఫామ్ విస్తరణ వంటి అంశాలపై ఆమె ప్రశ్నలు సంధించారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై చర్చ
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర విభజన హామీ మేరకు జరుగుతోందా? అనే ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ, కాజీపేటలో కోచ్, ఇంజిన్, వ్యాగన్ ఉత్పత్తి కోసం సమగ్ర యూనిట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీను అన్ని రకాల ఉత్పత్తులకు అనువుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
రైల్వే డివిజన్ అంశం
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై డా. కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి, గతంలో నిధుల కేటాయింపుల కంటే ఇప్పుడు తెలంగాణకు ఐదు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. డివిజన్ ఏర్పాటుపై ప్రస్తుతం ఆలోచన లేదని స్పష్టం చేశారు.
బైపాస్ రీ-అలైన్‌మెంట్
నష్కల్-హసన్ పర్తి, నష్కల్-చింతలపల్లి రైల్వే బైపాస్ లైన్ల రీ-అలైన్‌మెంట్ చేయాలని డా. కడియం కావ్య కోరారు. రైతుల వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి, ఎంపీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాజీపేట స్టేషన్ ప్లాట్‌ఫామ్ విస్తరణ
కాజీపేట రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయాలని డా. కడియం కావ్య డిమాండ్ చేశారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో అమలవుతున్న “అమృత్” ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.


Comments