సత్తుపల్లిలో ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం.!
ధ్యాన అవగాహన ప్రదర్శనలో పాల్గొన్న వివిధ ఆధ్యాత్మిక సంస్థలు.
సత్తుపల్లి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ ధ్యాన దినోత్సవం (డిసెంబర్ 21)ను పురస్కరించుకుని శనివారం సత్తుపల్లిలో ఆధ్యాత్మిక, విద్యా, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధ్యాన అవగాహన ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి పాత సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రతిరోజూ ధ్యానం చేస్తామని, మనసును ప్రశాంతంగా, సానుకూలంగా ఉంచుకుంటామని, భావోద్వేగాలను నియంత్రిస్తూ శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. సప్తరుషి మార్క్‌బా పిరమిడ్ ధ్యాన మందిరం, రామచంద్ర మిషన్, రామకృష్ణ యోగ సమితి, బ్రహ్మకుమారీస్, సత్యసాయి సేవ సమితి, సత్తుపల్లి లయన్స్ క్లబ్ తదితర ఆధ్యాత్మిక సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ధ్యానం ప్రాముఖ్యతను ప్రజలకు మరింత విస్తృతంగా తెలియజేయాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగానే ఈ అవగాహన ప్రదర్శన చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్న ధ్యాన, ఆధ్యాత్మిక ప్రముఖులు మాట్లాడుతూ ధ్యానం మనసుకు శాంతిని చేకూర్చి ఏకాగ్రతను పెంపొందిస్తుందని, ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేడు గుడిపాడు రోడ్డులోని పిరమిడ్ ధ్యాన మందిరంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


Comments