గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
దేవరుప్పుల మండల ఎస్సై సృజన్ కుమార్
తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల :
గణేష్ నవరాత్రి ఉత్సవాలు,నిమజ్జన కార్యక్రమం ప్రజలందరూ ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగేలా ఉత్సవ కమిటీలు సహకరించాలని దేవరుప్పుల మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ కోరారు.మంగళవారం వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీస్ స్టేషన్ ఆవరణలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సెప్టెంబర్ 07వ తేదీన వినాయక చవితి పురస్కరించుకొని నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని,నిమజ్జన వేడుకలకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని,విగ్రహాల ఏర్పాటు చేసే ముందు ఆయా ప్రాంతాల పరిధిలోని ఉత్సవ కమిటీ సభ్యులు ఆన్ లైన్ లో నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్ లో అనుమతులు పొందాలని సూచించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ నిర్దేశించిన సమయంలోనే లౌడ్ స్పీకర్లు వినియోగించాలని,పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు.కమిటీ సభ్యులు ప్రజల్లో చైతన్యం పెంచాలని,మండపాల వద్ద విద్యుత్ సౌకర్యం కోసం ట్రాన్స్ కో నిర్దేశించిన రుసుం చెల్లించి ప్రత్యేక కనెక్షన్ పొందాలని,ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి ఉత్సవాలు సక్రమంగా జరిగేలా చూడాలని వివాదాస్పద స్థలాలలో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు.మండపాల వద్ద రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వొద్దని,విగ్రహ మండపాల వద్ద ప్రతిరోజు కమిటీ సభ్యులలో ముగ్గురు తప్పనిసరిగా ఉండాలని,నిమజ్జనం రోజున గుర్తించిన మార్గాల ద్వారానే విగ్రహాలను తరలించాలని అన్నారు.సెప్టెంబర్ 5వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీజే లకు ఎలాంటి అనుమతులు లేవని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,కానిస్టేబుల్ మసూద్, పోలీస్ సిబ్బంది,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments