నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఇచ్చోడ ఎస్సై తిరుపతి
ఆదిలాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఇచ్చోడ ఎస్సై తిరుపతి ప్రజలకు సూచించారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత పోలీసు పికెటింగ్, రాత్రి గస్తీలు, వాహనాల తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, కేక్ కటింగ్లు, డీజేలు, లౌడ్‌స్పీకర్లు ఉపయోగించరాదని అన్నారు.
అర్ధరాత్రి తర్వాత రహదారులపై సంచారం చేయరాదని, గుమిగూడి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మహిళలు, యువతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం నిషేధమని, లైసెన్స్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేసినవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాలు ప్రభుత్వం విధించిన సమయానికి మాత్రమే కొనసాగాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
బాణసంచా కాల్చడం, ప్రజల శాంతి భద్రతకు ఆటంకం కలిగించే కార్యకలాపాలు చేపట్టకూడదని ఎస్సై తిరుపతి సూచించారు.


Comments