సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఏఐవైఎఫ్ ప్రతినిధుల సందడి
మేడ్చల్, ఆగస్టు 21 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని మహారాజా గార్డెన్స్‌లో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర 4వ మహాసభల్లో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రతినిధి బృందం ఘనంగా పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంపికైన ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ యువత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఉపాధి హక్కులను యువతకు నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వం దేశంలోని యువతను మతం మత్తులో ముంచడానికి ప్రయత్నిస్తున్నదే తప్ప, దేశ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, రాజీవ్ యువ వికాసం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


Comments