వనపర్తి వైద్య విద్యార్థికి నీట్ పీజీలో ఆల్ ఇండియా 16 ర్యాంక్
వనపర్తి,ఆగస్టు 20 (తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ వైకుంఠ రెడ్డి మనవడు రిత్విక్ రెడ్డి ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షలో అఖిలభారత స్థాయిలో 684 మార్కులతో 16వ ర్యాంక్ సాధించాడు. స్వప్న భాస్కర్ రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు రిత్విక్ రెడ్డి చిన్ననాటి నుంచే చదువులో చాలా చురుకైన విద్యార్థిగా ముందున్నాడు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు హైదరాబాదులో చదివిన రిత్విక్ రెడ్డి 2019 నీట్ పరీక్షలో అఖిలభారత స్థాయిలో 430 ర్యాంకు సాధించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో గల ఎయిమ్స్ లో మెడిసిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ లు తీసుకోకుండానే ఇంట్లోనే స్వతహాగా ప్రిపేర్ అయ్యి 2025 నీట్ పీజీ పరీక్షలో అఖిలభారత స్థాయిలో 16 వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో ఒకటవ ర్యాంకు సాధించి తల్లిదండ్రుల లక్ష్యాన్ని చేరుకున్నాడు. అలాగే చిన్ననాటి నుంచి తన మనవడికి అన్ని విధాల ఆర్థిక తోడ్పాటు అందించిన నానమ్మ ప్రమీల తాతయ్య వైకుంఠ రెడ్డిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ మనవడు రిత్విక్ రెడ్డి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు తో పాటు జాతీయస్థాయిలో 16 వ ర్యాంకు సాధించడం వెంకటేశ్వర స్వామి కృపగా భావిస్తున్నామని వారు అన్నారు.


Comments