కుల నిర్మూలనకు వ్యవస్థ మార్పే మార్గం స్పూర్తి గ్రూప్ చర్చా కార్యక్రమం
_మనువాదం ప్రభావానికి వ్యతిరేకంగా ప్రజల పోరాటం అవసరం – వక్తల పిలుపు
ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం–స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కుల నిర్మూలన అంశంపై చర్చా కార్యక్రమం శుక్రవారం కమలానగర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్పూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.చర్చను ప్రారంభించిన గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ భారతదేశంలో కుల వ్యవస్థ అంతర్లీనంగా వేళ్లూనుకుపోయిందని, సనాతన మతం నుంచి నేటి హిందూ మతం వరకు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ప్రాతిపదికగానే కొనసాగుతోందన్నారు. దీనికి మను ధర్మమే ప్రధాన ఆధారమై బ్రాహ్మణీయ భావజాలంతో శూద్రులను బానిసలుగా మలిచేందుకు దేవుడు, మతాన్ని వినియోగించుకున్నారని విమర్శించారు. నేటి సమాజంలో కులవృత్తులు తగ్గినప్పటికీ మనువాద ప్రభావం కొనసాగుతుండటంతో కుల వ్యవస్థ మరింత ఘనీభవిస్తోందన్నారు. పాలకులు మనువాదాన్ని రాజ్యాంగంగా మలచే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాటం అవసరమని పిలుపునిచ్చారు.
శివన్నారాయణ మాట్లాడుతూ పూర్తిగా వ్యవస్థ మార్పు జరగకుండా కుల నిర్మూలన సాధ్యం కాదని, వ్యవస్థ మార్పుకోసం సమిష్టి పోరాటం చేయాలన్నారు. ఎం.భాస్కర్ రావు కుల వ్యవస్థకు మూలం బ్రాహ్మణీయ భావజాలమేనని, అది చేసిన అకృత్యాలను ప్రజలే తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. నేటి సమాజంలో కుల దురహంకారాలు హత్యల దశకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ సమాజ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిస్ట్ విశ్లేషణ అవసరమని చెప్పారు. పురాతన కాలంలో కులాలు వర్గ ప్రాతిపదికన పనిచేశాయని, నేటి సమాజ పూరోభివృద్ధికి కుల వ్యవస్థ ప్రధాన ఆటంకమని పేర్కొన్నారు. కుల నిర్మూలనకు సమసమాజ నిర్మాణమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏకే దుర్గాచార్యులు, రుక్కయ్య, మల్లేశం, పుష్ప రాజ్ తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ కుల నిర్మూలన కోసం తమ వంతు కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, గౌసియా, దువా కిరటి, శివన్నారాయణ, మల్లేశం, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.


Comments