ఆశా వర్కర్లు కలెక్టర్ కార్యాలయం దగ్గర 5వ రోజు రిలే నిరాహార దీక్ష
పెండింగ్ లేప్రసి సర్వే బిల్లులు వెంటనే చెల్లించాలి : ఆశా వర్కర్లు డిమాండ్
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు)
ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న లేప్రసి సర్వే బిల్లులు వెంటనే చెల్లించాలని, పారితోషికం లేని పని చేయబోమని డిమాండ్ చేస్తూ బాలానగర్ పీహెచ్‌సీలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.శుక్రవారం రోజు నిర్వహించిన ఐదవ రోజు రిలే నిరాహార దీక్షను యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవతి కళ్యాణి మాట్లాడుతూ, ప్రస్తుత లేప్రసి సర్వేకు సంబంధించిన బిల్లులు, గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రభుత్వం ఇప్పటికీ బడ్జెట్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎప్పుడు విడుదల అవుతుందనే స్పష్టత కూడా లేకపోవడం వల్ల ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.పెండింగ్ లేప్రసి సర్వే బిల్లులు, ఇతర అన్ని బిల్లులు వెంటనే చెల్లించాలని, ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 ఇవ్వాలని, బాలానగర్ పీహెచ్‌సీలో పనిచేస్తున్న 7 మంది ఆశా వర్కర్లకు అక్టోబర్ నెల జీతాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ పనుల పేరిట జరుగుతున్న వేధింపులు ఆపాలని, దుర్భాషలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. ఉన్నికృష్ణ మాట్లాడుతూ, డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు లేప్రసి సర్వే పనులను నిలిపివేయాలని ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు. సంవత్సరాల తరబడి సర్వేలు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులు చెల్లించే వరకు ఎల్సీడీసీ సర్వే చేయబోమని యూనియన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.డిసెంబర్ 23న జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని, డిసెంబర్ 27న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆశా వర్కర్లకు యూనియన్ పిలుపునిచ్చింది.


Comments