వెన్నుపోటు రాజకీయాల వల్లే పార్టీకి నష్టం
ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తా
— వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి,డిసెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల వల్ల పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని నందీహిల్స్‌లో తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.వనపర్తి నియోజకవర్గ పరిధిలోని 140 గ్రామపంచాయతీ స్థానాలకు ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తమ సంతృప్తిని ఓటు రూపంలో వెల్లడించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ ఎన్నికల్లో 51 శాతం బీసీలకు అవకాశం కల్పించామని, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 35.09 శాతం పెరిగిందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌కు వచ్చిన 51 గ్రామపంచాయతీ స్థానాల్లో కనీసం 15 నుంచి 20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులే గెలిచే అవకాశముందని, అయితే కొంతమంది సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల కారణంగా పార్టీ కార్యకర్తలకు నష్టం జరిగిందని ఆరోపించారు.ఈ వ్యవహారంపై ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీలకు, హైకమాండ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని మేఘా రెడ్డి స్పష్టం చేశారు. తనపై లేదా నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిపై వ్యక్తిగత అసంతృప్తి ఉంటే ప్రత్యక్షంగా తేల్చుకోవాలని, కానీ పార్టీకి విధేయులుగా పనిచేసే కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని ప్రశ్నించారు.సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేసే వారి తీరును కాంగ్రెస్ పార్టీ మేధావులు, ప్రజలు గమనిస్తున్నారని, దీనిపై సదరు నాయకులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments