పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భూక్య వెంకట్ రామ్ బాధ్యతలు స్వీకరణ
హనుమకొండ, తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా న్యాయవ్యవస్థలో ప్రభుత్వ పరంగా ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా మొదటి అదనపు జిల్లా కోర్టుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా భూక్య వెంకట్ రామ్ నియమితులయ్యారు.
ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన వెంకట్రామ్ 1988లో ఉమ్మడి రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. ప్రజల సమస్యల పట్ల నిబద్ధతతో న్యాయసేవలందిస్తూ, లంబాడ సమాజానికి చెందిన యువకుడిగా పలు కేసుల్లో ప్రజల పక్షాన వాదించి పేరు సంపాదించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన న్యాయవాదుల సంఘ ప్రధాన కార్యదర్శి లావుడియా సిద్దు నాయక్, పోరీక్ సమ్మయ్య నాయక్, బిక్షపతి న్యాయవాది, లావుడియా రాజు నాయక్, ఇతర బంజారా సంఘాల నాయకులు, న్యాయవాదులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదవిలో భూక్య వెంకట్ రామ్ మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.అనుభవం, సేవా దృక్పథం ఉన్న న్యాయవాదికి ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని గిరిజన న్యాయవాదులు అభినందించారు.


Comments