అతివేగం.. అకాలమరణానికి పిలుపు!
సమాజాన్ని కలవరపెడుతున్న యువతలో వేగ ధోరణి
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
వారు నవ్వుతూ వెళ్లారు… మళ్లీ రారు. వయసు పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్య ఉన్న యువకుల ప్రాణాలు.. ఇటీవలి కాలంలో రోడ్లపై వేగాల బలి అవుతున్నాయి.
బైక్ మోడిఫై, సైలెన్సర్ రిమూవ్, గల్లీల్లో స్పీడ్ ట్రయల్స్, జనాల్లో మధ్యబజారులో బర్త్‌డే స్టంట్లు – ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ కాదు, మృత్యువుకు ముంచే మార్గాలు అయ్యాయి.
వీధుల్లో వేడుకలు.. వేదనల మార్గమవుతున్నాయా?
ఇంట్లో జరగాల్సిన పుట్టినరోజు వేడుకలు, బహుమతులపై ఆనందించాల్సిన సందర్భాలు – ఇప్పుడు యువత రోడ్ల మీద మ్యూజిక్ పెట్టి బైక్‌లు, కార్లపై వేగం చూపించడం ద్వారా తమ సంతోషాన్ని ప్రకటించుకుంటోంది. కానీ ఆ వేడుకల్లో ఒక్క తప్పు ప్రాణం తీస్తోంది. వేగం అనేది ఆనందానికి కాదు, అకాలమరణానికి మార్గం అవుతోంది.
ఓ బైక్ కోసం ప్రాణం.. మరో బైక్ వల్ల ప్రాణం పోవడం!
ఒకవైపు తల్లిదండ్రులు బైక్ కొనలేదనే బాధతో కొడుకు ఉరేసుకున్న వార్త, మరోవైపు అదే వాహనంపై వేగం చూసేందుకు వెళ్ళిన యువకుడు అదుపుతప్పి ప్రాణం కోల్పోయిన ఘటనలు దేశంలో ప్రతివారం వినిపిస్తున్నాయి.
ఇవి ఒక్కో కుటుంబాన్ని కన్నీటిలో ముంచుతున్నాయి. జీవితంలో ముందుకెళ్లాలని చూసే తల్లిదండ్రుల ఆశలు… తమ కన్నుల ముందే అడియాశలు అవుతున్నాయి.
వేగం వెనుక ఉన్న బాధ్యతారాహిత్యం
వేగంగా వాహనాలు నడపడం కేవలం ఒక ప్రమాదకర అలవాటు కాదు – అది చట్ట ఉల్లంఘన. కానీ యువత దీనిని స్టైల్, గర్వం, ఫ్యాషన్‌గా చూస్తోంది.
ట్రాఫిక్ పోలీసుల చేతుల్లోకి పడినా, వారిపై కేసులు నమోదైనా, వారికి మాత్రం తాత్కాలిక అటకెక్కిన అనుభూతి తప్ప – జీవితం విలువే తెలియదు.
గతంలో హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌పై వేగంగా నడిపిన కారు కింద పడిపోయి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇద్దరూ మృతి చెందిన ఘటన దేశాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ కారులో గంజాయి కనిపించింది. మరి ఇలాంటి సంఘటనలు కళ్లముందు చూస్తున్నా మార్పు ఎక్కడ?
గారాబమే? లేక గాపరామీనా?
తల్లిదండ్రుల ప్రేమ పేరుతో పిల్లలు అడిగిన ప్రతిదీ వెంటనే ఇవ్వడం, వారి అల్లరి, వేగవేధనలను ‘వయస్సు అలాంటిదే’ అని మన్నించడం – అనేకమంది తల్లిదండ్రులు చేస్తున్నారు. కానీ అదే ప్రేమ… అదే గారాబం… చివరకు వారి కన్నవారిని కోల్పోయే దారికి తీసుకెళ్తోంది.
కంటివెంట కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడే తల్లిదండ్రుల మాటల్లో, “అప్పట్లో బైక్ కోసం ఎంతగా పట్టుబడ్డాడో… ఇప్పుడు అదే బైక్ అతన్ని తీసుకెళ్లింది” అనే వాక్యాలు చలించేస్తున్నాయి.
యువతే కాదు – సమాజమే బాధ్యత వహించాలి
ఈ వేగ సంస్కృతి కేవలం కుటుంబాలకే కాకుండా సమాజానికే ముప్పుగా మారుతోంది. పాదచారుల ప్రాణాలకు హాని, ట్రాఫిక్ జామ్‌లు, అకాల మరణాల శాతం పెరుగుతోందంటే – ఇది మౌనంగా చూసిపోదగ్గది కాదు.
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యాసంస్థల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాలి. పిల్లలు ఏదైనా కొత్త వాహనం కొనాలంటే, ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీతో పాటు – డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ తప్పనిసరి చేయాలి.
ప్రతి వేగం వెనుక ఒక కన్నీటి కథ ఉంది.
ఈ రోజున యువత ‘ఓ మై గాడ్.. ఎంత స్పీడ్!’ అని ప్రశంసల కోసం బతుకుతుంటే… రేపు వారి కుటుంబాలు ‘ఓ మై గాడ్.. ఎందుకిలా జరిగిందీ!’ అంటూ శోక సంద్రంలో మునిగిపోతున్నాయి.
వేగం చూపించే బదులు… విలువ చూపించాలి.
రోడ్డుపై స్టైల్‌కు బదులు, జీవితంపై స్థిరత ఏర్పరుచుకోవాలి.
అప్పుడు మనం మన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఒక నిజమైన బలం అవుతాం.


Comments