ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
_యువకుడు టవర్ ఎక్కి నిరసన
– పోలీసుల హామీతో శాంతించిన స్థానికులు
చర్లపల్లి, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంకాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి ఈసీ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్‌పై స్థానికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.జిహెచ్ఎంసి పార్క్ సమీపంలో టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాలనీవాసులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాలనీకి చెందిన ప్రణయ్ కుమార్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందికి దించేందుకు ప్రయత్నించారు. కొంతసేపు టవర్‌పైనే ఉండి నిరసన కొనసాగించిన యువకుడు, అనంతరం పోలీసుల హామీతో కిందికి దిగాడు.కాలనీవాసులు ఆరోపిస్తూ కాలనీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్ కుమార్ గౌడ్ సహా కొంతమంది నాయకులు టవర్ యజమానితో కుమ్మక్కై రహస్యంగా నిర్మాణం చేపట్టారని విమర్శించారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నివాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం ఆరోగ్యానికి హానికరమని, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఇది ముప్పుగా మారుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.మూడు గంటల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్త పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే సెల్ టవర్‌ను పూర్తిగా తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాలనీవాసులు స్పష్టం చేశారు.


Comments