ఖమ్మం జర్నలిస్టులకు ‘ఇందిరమ్మ’ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలి
• ఇతర రాష్ట్రాల తరహాలో సీనియర్ జర్నలిస్టులకు ‘పెన్షన్’ ఇవ్వాలి
• నిలిపి వేసిన జర్నలిస్టుల రైల్యే పాసులను పునరుద్ధరించాలి
• డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానం
• పశ్చిమ ఆసియా యుద్ధంలో జర్నలిస్టులపై దాడులకు ఖంఢన
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 4(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మంలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ’ ఇండ్ల పథకాన్ని వర్తింప జేయాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.ఈ పథకం క్రింద మీడియా రంగంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ స్థలాలు మంజూరు చేసి, ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఖమ్మం నగరంలో యూనియన్ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్.రావు) ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో ఖమ్మం జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ పథకం క్రింద ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు సాధించిచేందుకు త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. అలాగే సీనియర్ జర్నలిస్టులకు ‘పెన్షన్’ పథకాన్ని అమలు చేయాలని సమావేశం మరో తీర్మానాన్ని ఆమోదించించింది. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులకు కొన్ని రాష్ట్రాలు ‘పెన్షన్’ పథకాన్ని అమలు చేస్తున్నాయని, బీహార్ రూ. 15,000, మధ్యప్రదేశ్ రూ. 20,000 పెన్షన్ ఇస్తుండగా, అస్సాం, తమిళనాడు, పాండిచ్చేరి వంటి 19 రాష్ట్రాల్లో రూ. 6,000 నుండి రూ. 20, 000 వరకు పెన్షన్ ఇస్తున్నారని, తక్షణమే తెలంగాణలో కూడా జర్నలిస్టులకు ‘పెన్షన్’ పథకాన్ని అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. అంతే కాకుండా ‘కరోనా’ సమయంలో నిలిపి వేసిన జర్నలిస్టుల రైల్యే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డబ్ల్యూజేఐ కోరింది. పాసులు పునరుద్ధరించేందుకు జిల్లాకు చెందిన ‘ఎంపీ’లకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ ... ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖంఢించింది. ఈ దాడుల్లో మీడియా ప్రతినిధులు లక్ష్యంగా మారడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరింది. దాడుల్లో మరణించిన జర్నలిస్టులకు సమావేశం సంతాపం తెలిపింది.
జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, గౌరవం కోసం నిరంతర పోరాటం : ఎన్.ఎస్.రావు
డబ్ల్యూజేఐ భారతదేశంలోని జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు మరియు వృత్తిపరమైన గౌరవం కోసం నిరంతరం పోరాడుతోందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్.రావు) అన్నారు. ఈ సమావేశానికి ముందు రావు మాట్లాడుతూ మీడియా రంగంలో పని చేస్తున్న విలేకర్లు, ఎడిటర్లు, ఫోటో గ్రాఫర్లు, వీడియో, డెస్క్ జర్నలిస్టులు మరియు ఇతర సిబ్బంది ప్రయోజనాలను కాపాడటానికి ఈ సంఘం ఉద్భవించిందని చెప్పారు. మీడియా సంస్థల్లో మజీథియా వేతన బోర్డు వంటి సిఫార్సుల అమలు కోసం ఒత్తిడి వత్తిడి తీసుకొస్తున్నామని తెలిపారు. అలాగే, విలేకర్లకు పెన్షన్ సౌకర్యం, ఆరోగ్య బీమా మరియు ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం నుండి అందేలా చూడడం, ఎల్లో జర్నలిజంకు వ్యతిరేకంగా పోరాడుతూ, వార్తలలో నిజాయితీని మరియు విశ్వసనీయతను కాపాడటమే లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కోకన్వీనర్లు యెన్నెబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, ఎన్. రామకృష్ణ, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జి. నారాయణ రావు, మోడెపల్లి కిరణ్, ఏనిగండ్ల శ్రీనివాస రావు, జాబిశెట్టి కుటుంబ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments