సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వవిద్యార్థుల సందడి.
అల్యూమిని మీట్–2026 ఘనంగా నిర్వహణ.
సత్తుపల్లి, ఏప్రిల్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోని బి గంగారం గ్రామం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం అల్యూమిని మీట్–2026 ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ దాసరి ప్రభాకర్ రెడ్డి సంయుక్తాధ్వర్యంలో, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ దాసరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కళాశాలలో గడిపిన నాలుగేళ్లు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తాయని పేర్కొన్నారు. పూర్వవిద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడి సమాజంలో బాధ్యతగల వ్యక్తులుగా, నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జూనియర్ విద్యార్థులకు మార్గనిర్దేశకులుగా నిలవాలని సూచించారు. గ్రామీణ నేపథ్యంతో ఉన్న విద్యార్థులకు పూర్వవిద్యార్థులు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శేషారత్నకుమారి మాట్లాడుతూ, అల్యూమిని మీట్ ద్వారా పూర్వవిద్యార్థులు–ప్రస్తుత విద్యార్థుల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కళాశాల అభివృద్ధి, ప్లేస్మెంట్లు, ఇంటర్న్‌షిప్‌లలో పూర్వవిద్యార్థుల సహకారం అవసరమని పేర్కొన్నారు. విశిష్ట సేవలందించిన పూర్వవిద్యార్థులను సన్మానించారు. కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో సంస్థ అధినేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి బండి అన్విద నిర్వాహకులను అభినందించారు. కన్వీనర్ డాక్టర్ పాముల శేఖర్ బాబు వివరాల ప్రకారం మొత్తం 113 మంది పూర్వవిద్యార్థులు హాజరయ్యారు. వారిలో 90 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. పరస్పర సహకారంతో కెరీర్ అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. యువ పూర్వవిద్యార్థి సాధన పురస్కారం–2026 కింద యామ శ్యాంమహేందర్ (సబ్ పోస్ట్‌మాస్టర్, సత్తుపల్లి) మాట్లాడుతూ, తాను సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. కళాశాలలో అభ్యసించిన క్రమశిక్షణ, పట్టుదల, అధ్యాపకుల మార్గనిర్దేశం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఈసీఈ విభాగానికి చెందిన పూర్వవిద్యార్థిగా తన అనుభవాలను పంచుకున్నారు. బి. జితేందర్ కుమార్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్– సిఎస్ఆర్, తన్లా ఫౌండేషన్) మాట్లాడుతూ, ప్రాక్టికల్ జ్ఞానంతో కూడిన ఉన్నత విద్యను అందించిన ఈ సాంకేతిక కళాశాలలో చదవడం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. కళాశాలలో పొందిన విద్య, శిక్షణ వల్లే మంచి ఉద్యోగాన్ని సాధించగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కళాశాల ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.


Comments