హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
సోయం - అధికారులు లేక గ్రామసభలపై ప్రశ్నలు.
దమ్మపేట, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం విమర్శించారు. అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో గురువారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, రైతు భరోసా, సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు, గృహలక్ష్మి–మహాలక్ష్మి పథకాలు, వృద్ధాప్య–వికలాంగుల పెన్షన్ల పెంపు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వైద్యం వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. మొత్తం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. గ్రామసభలకు అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం లేకుండా పోతుందని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత అధికారులపై ఉండాలని పేర్కొన్నారు. గ్రామంలోని సమస్యలపై నోడల్ అధికారి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ, క్రీడాస్థలాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, పరిశుభ్రత కోసం ట్రాక్టర్లు, నీటి ట్యాంకులు వంటి సదుపాయాలు కల్పించారని తెలిపారు. సర్పంచ్
సోయం సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Comments