సూర్యకిరణాలతో స్వామివారి పాదాల దివ్య దర్శనం
_గిరిప్రదక్షిణ మహోత్సవంలో భక్తుల భక్తి పారవశ్యం
– ఘనంగా నిర్వహణ
కీసర, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చైత్ర పౌర్ణమి మరియు శ్రీ హనుమత్ విజయోత్సవం సందర్భంగా గిరిప్రదక్షిణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి నాడు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈసారి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.ఉదయం పవిత్ర వేళలో స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకిన అరుదైన దృశ్యం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ఈ దివ్య దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి, దర్శించుకుని పరవశించారు.మేళతాళాల మధ్య భక్తులు గిరిప్రదక్షిణ చేస్తూ భజనలు, గీతాలాపనలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తిరసంతోమార్మోగాయి.తదుపరి శ్రీ వీరాంజనేయస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి పుష్పాలు, ఫలాలతో నైవేద్యాలు సమర్పించారు. వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి లాకెట్లు ప్రసాదంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ మాట్లాడుతూ, గిరిప్రదక్షిణ మహోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమమని తెలిపారు. భక్తుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు, గ్రామ ప్రజలు, దేవస్థానం నిర్వాహకులు, సేవా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments