ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు.
ఆదర్శ గ్రామంగా నాగారం నిలవాలి.
బాల్య వివాహాలను నిర్మూలించాలి.
బాలికలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించాలి.
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
హాసన్ పర్తి,ఏప్రిల్ 02(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు గ్రామస్తుల సహకారంతో నాగారం ఆదర్శంగా నిలవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం నాగారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ ను గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి,ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రం లో అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి,చేయూత పింఛన్లు తదితర ఎన్నో పథకాలు అమలవుతున్నాయని ఇందిరమ్మ ఇండ్ల విషయానికొస్తే ఒక్కో గ్రామానికి దాదాపుగా 35పైగా ఇండ్లు మంజూరై ఉన్నాయన్నారు. ఒక్క నాగారం గ్రామంలోనే 800 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని,గృహ జ్యోతి పథకం కింద 63 లక్షల రూపాయలు వినియోగదారులకు ఉచిత విద్యుత్ ప్రయోజనం కలిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎల్ త్రీ లో ఉన్న వారికి తదుపరి ఇచ్చే ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం కావాలన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయం,ఆరోగ్య కేంద్రం,పాఠశాల,అంగన్వాడీ కేంద్రాలలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే సర్పంచ్ బాధ్యత తీసుకుని పరిష్కరించాలని సూచించారు. మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే మహిళా శక్తికి నిదర్శనమని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి నెల సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. గతంలో ఏవైనా రుణాలు తీసుకోవాలంటే ఇబ్బందులు ఉండేవని,కానీ ప్రస్తుతం మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తామని బ్యాంకర్లు ముందుకు వస్తున్నారని తెలిపారు. మహిళలు తీసుకున్న రుణాలను వంద శాతం తిరిగి చెల్లిస్తారనే నమ్మకం బ్యాంకర్లలో ఉందని పేర్కొన్నారు.మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించినప్పుడు సంఘాలకు సంబంధించిన రుణాలు తీసుకోవడం చెల్లించడం లాంటివి చర్చించడంతోపాటు గ్రామానికి సంబంధించిన అంశాలను కూడా చర్చించాలని అన్నారు. ఆదర్శ గ్రామం అంటే మంచి రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ,స్ట్రీట్ లైట్స్ మాత్రమే కాదని ఒక్కరూ కూడా పోషణ లోపం లేని పిల్లలు, క్షయ వ్యాధి లేకుండా,రక్త హీనతతో గర్భిణీలు లేకుండా ఆదర్శ గ్రామంలో ఉండాలన్నారు.18 సంవత్సరాలు నిండకుండా ఏ అమ్మాయి పెళ్లి గ్రామంలో జరగకుండా చూసుకోవాలని బాల బాలికలు డిగ్రీ వరకు చదివే విధంగా ప్రోత్సహించి పిల్లల ఇష్ట ప్రకారం ఎక్కడి వరకు చదువుకోవాలనుకుంటే అక్కడి వరకు చదివించాలని సూచించారు. నాగారం గ్రామం కూడా ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుదామన్నారు. గ్రామస్తుల సమష్టి సహకారంతోనే ఆదర్శ గ్రామం సాధ్యమని పేర్కొన్నారు. గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాల గురించి గ్రామానికి చెందిన తోట ప్రవీణ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,విద్యుత్, ఇతర శాఖల అధికారులు గ్రామ అభివృద్ధికి సంబంధించి వివరాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య,జిల్లా హౌసింగ్ పీడీ సిద్దార్థ నాయక్,జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ,జడ్పీ డిప్యూటీ సీఈవో రవి,తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో సుమన వాణి,విద్యుత్ శాఖ డీఈ అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments