ప్రజా పాలనలో భాగంగా వార్డు సభలు
– సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన
_ప్రతి అర్హ కుటుంబానికి పథకాలు చేరేలా చర్యలు
– అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్–మల్కాజిగిరి, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ప్రజా పాలన–ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం ఆలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో నిర్వహించిన వార్డు సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు శిరీష రెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, మహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
ఇక జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం, వారంలో మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మరో మూడు రోజులు రాగి జావా, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ వంటి కొత్త పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పథకాల గురించి తెలియని వారికి అవగాహన కల్పించడం ప్రతి లబ్ధిదారుడి బాధ్యత అని సూచించారు.దేశంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో ఉందని పేర్కొంటూ, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.కార్యక్రమంలో ముఖ్యమంత్రి సందేశం వినిపించడం, అభివృద్ధి కార్యక్రమాల వీడియో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రజలు తమ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికా
రులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, వైస్ చైర్మన్లు, తహసీల్దార్లు, నోడల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments