గ్రామసభలతో ప్రజలకు చేరువవుతున్న సంక్షేమం
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,ఏప్రిల్2(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ గొప్ప కార్యక్రమమని, ఒకే రోజు జిల్లాలోని 268 గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.గురువారం ఏదుల మండలం కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ గీతాలాపన చేసి, గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అధికారులు చదివి వినిపించారు.గ్రామంలో అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఉపాధి హామీ పథకం పనులు వంటి అంశాలను వివరించారు.గ్రామ ప్రజల సమస్యలు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యతలపై కూడా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామసభల ముఖ్య ఉద్దేశం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయడంతో పాటు, ఇంకా అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించడం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ చేయడం వంటి చర్యలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు.ఏదుల గ్రామంలో 303 మంది రైతులకు రూ. 2.77 కోట్ల రుణమాఫీ, 1351 రేషన్ కార్డుల్లో కొత్తగా 192 కార్డుల మంజూరు, 489 మందికి ఉచిత విద్యుత్, 36 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఉచిత చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు.మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.తాగునీటి సమస్య పరిష్కారం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ. 480 కోట్ల రుణమాఫీ, లక్షలాది రైతులకు రైతు భరోసా అందించామని తెలిపారు. త్వరలో విద్యార్థుల కోసం ఉదయం ఆహార పథకం అమలు చేయనున్నట్లు కూడా వెల్లడించారు.ఇంకా సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారు గ్రామసభలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.


Comments