దమ్మపేటలో గ్యాస్ ధరల పెంపుపై సిఐటియు ఆందోళన.!
కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గించాలని డిమాండ్.
దమ్మపేట, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి 20 రోజులు కూడా కాకముందే మళ్లీ కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతోందని విమర్శించారు. కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదలతో చిన్న వ్యాపారులు, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు మాట్లాడుతూ, ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడంతో ఆటో కార్మికులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని, రవాణా రంగంపై కూడా దాని ప్రభావం పడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కోడూరి కృష్ణ, రామకృష్ణ, కర్రాజులు రాము, రాంప్రసాద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments