ఎల్ బి నగర్‌లో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ
_ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని నివాళులు
– వీరుల త్యాగాలు తరతరాలకు చేరాలన్న పిలుపు
ఎల్ బి నగర్, ఏప్రిల్ 03 (తెలంగాణ ముచ్చట్లు ) :
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్‌లో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏ కులమైనా, ఏ జాతైనా తమ గొప్పతనాన్ని, త్యాగాలను గుర్తు చేసుకోకపోతే రాబోయే తరాలకు అవి తెలియవని అన్నారు. నిజాం పాలనలో జరిగిన దోపిడి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన చుక్క సత్తన్న సేవలను కూడా ఆయన స్మరించారు.మారుతున్న కాలంలో కూడా తమ సంస్కృతిని కాపాడుకుంటున్న కురుమ జాతి ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకటేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సామ రంగారెడ్డి, జాజుల శ్రీనివాస్ గౌడ్, కొప్పుల నరసింహారెడ్డి, శ్యామ్, ఆదికృష్ణ, వెంకన్న, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


Comments